సచిన్ టెండూల్కర్: అసాధ్యమనుకున్న గెలుపు కలని తన ఒంటరి పోరుతో తీర్చబోయి చివరి అడుగులో తడబడటం తట్టుకోలేకపోతున్నా… మిగతా ఆటగాళ్ళు అందరు కలిసి సచిన్ (ఇండియా కూడా) ఓడిపోయే లాగ చేసినందుకు సిగ్గుపడాలి (ముఖ్యంగా జడేజా). టీం ఓడిపోవడం చూసి సచిన్తో పాటు కోట్లాది అభిమానుల గుండె పగిలి ఉండాలి. ఇప్పటికైనా సచిన్ తన సహచరుల మీద నమ్మకం తగ్గించుకుంటే ఇండియా కి మంచిది. నేను క్రికెట్ చూడటం మొదలు పెట్టిన రోజుల్లో లాగానే ఇంకా ఇంత భారాన్ని ఇష్టం తో మోస్తున్నందుకు సచిన్ ని క్రికెట్ కి “దేవుడు” అనాలా ఇంకేమన్నా అనాలా ????
తెలుగు టీవీ మీడియా: “మెరుగైన సమాజం కోసం“…. ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదా?? ఇది ఒక తెలుగు న్యూస్ చానల్ కాప్షన్. వారం రోజులుగా వీళ్ళు చేస్తున్న హడావిడి, హంగామా, కవరేజ్ చూస్తుంటే సిగ్గేస్తుంది. సినిమా హీరో రాజశేఖర్ & జీవిత ని స్టూడియో కి పిలిచి, రెచ్చకొట్టి, లేని పోని విషయాలు తవ్వి – వాళ్ళు చిరంజీవి ని అడ్డమైన మాటలు అనేవరకు పుల్ల పెట్టి, ఆ తంతుని “లైవ్ షో” అని టెలికాస్ట్ చేస్తున్న వాళ్ళని ఏమనాలి. దాని వల్ల జరిగేది ఒక్కటే – అభిమానులు రెచ్చిపోయి ఎమన్నా చేస్తే (నిరసనలు, బెదిరింపులు….), చక్కగా దానిని రికార్డ్ చేసి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేస్తే వాళ్లకి వచ్చే సునకానందం ఇంతా అంతా కాదేమో. ఎంత బాధ్యతా రాహిత్యమో కదా…
రాష్ట్ర కాంగ్రెస్: రాష్ట్రం రావణ కాష్ఠం లా రగిలిపోతుంది. మనం వోట్లు వేసి ఎన్నుకోని నాయకులు, ఎన్నికల్లో నిలబడితే డిపాజిట్ కూడా రాని పనికిమాలిన వ్యక్తులు మన రాష్ట్రాన్ని పరిపాలించడం చూస్తూ బాధతో నిస్సహాయం గా నిలబడటం తప్ప ఏమి చేయలేకపోతున్నాం. మాటకి ముందు మాటకి వెనకాల ఈ చేతకాని దద్దమ్మ లు వాడే పదాలు ఎంటయ్యా అంటే: “మేడం”, “అమ్మ”, “అధిష్టానం”…. సోనియా ఎవడికి అమ్మ నాయనా?? మీకా ?? రాష్ట్ర ప్రజలకా?? బాధ్యతలు గాలికి వదిలేసి అమ్మ చుట్టూ అధికారం కోసం ప్రదిక్షణలు ఇంకా ఎన్నాళ్ళు చేస్తారో?
చిరంజీవి & ప్రజారాజ్యం: చిరంజీవిని చూస్తుంటే జాలి వేస్తుంది. చిరు కి ఉన్న కోరిక ఏమిటో, ఆశయం ఏమిటో ఆయనగారికే తెలియాలి. మాతో కలిస్తే ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ లో ఒక వర్గం అనగానే ఆ వలలో చాలా తేలిగ్గా చిరు పడిపోయి ఈ రోజు గిలగిలలాడటం చూస్తుంటే నవ్వు వస్తుంది. జీవితం లో అన్నీ ఉన్నా పదవి మీద ఎందుకో ఇంత పిచ్చి. అండగా ఉంటామన్న అభిమానుల్ని పట్టించుకోకుండా వలస వాదుల్ని అందలం ఎక్కించి ఇప్పటికే అతి పెద్ద తప్పు చేసాడు అన్నయ్య. ప్రజల్లో మిగిలి ఉన్ననమ్మకాన్ని కూడా పోగుట్టుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు ఉంది ప్రజారాజ్యం పార్టీ…! చిరు కాంగ్రెస్ తో కలిస్తే మా పవన్ ఇప్పుడు ఎవరి మీద పోరాడాలి.
తెలుగు సినీ పరిశ్రమ: కోట్లకి కోట్లు సంపాదన, నిరంతర ఆదాయం, ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలనే అత్యాశ: ఇవన్నీ మన సినిమా వాళ్ళ గుణాలు. “దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు“, వరద భీబత్సం జరిగి నెల అయ్యాక ఇప్పుడేదో ఆడి, పాడి, రంజింప చేస్తే టిక్కెట్ల రూపం లో జనాలు ఇచ్చే డబ్బుల్ని పోగేసి విరాళాల రూపం లో మళ్ళా అదే పిచ్చి జనాలకి ఇచ్చి సేవ చేస్తారంట. పిచ్చ కామెడి గా ఉంది. ఏర్పాట్లు, బద్రత, ట్రాఫిక్ జామ్లు, మీడియా కవరేజి, మూడు రోజుల సెలవులు – వచ్చే ఆదాయం వీటికే సరిపోద్ది. ఎవరికీ వారు సహాయం చేస్తే ఎంత బాగుండేదో కదా? మన జేబులో నుండి ఒక్క రూపాయి తీయాలంటే ఎంత నరకమో వీళ్ళకి. ఈ తెలివి సినిమా ప్రేక్షకుడికి వచ్చి ఎవరూ టిక్కెట్లు కొనకపోతే పరిశ్రమకి వచ్చే నష్టం లెక్క కట్టలేనిది. నిజమైన సమాజ సేవ ఎప్పుడు చేస్తారో చూడాలి…!























